జాతీయం
సోమనాథ్ ఆలయం వైభవంతో కళకళలాడుతోంది: ప్రధాని నరేంద్ర మోదీ
28-09-2026 10:28
1026 లో మొహమ్మద్ ఘజనీ సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడని.. కానీ వారికి ఇవాళ ఏ గుర్తింపూ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయినప్పటికీ సోమనాథ్ ఆలయం పూర్తి వైభవంతో కళకళలాడుతోందని .. ఈరోజు నిర్వహించిన మన్ కీ బాత్ లో ప్రసంగించారు.
xPress24, Delhi, September 27,
ఈ ఏడాదిని ఆత్మగౌరవానికి చెందిన గొప్పపండుగయినటువంటి " సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్"తో మొదలు పెట్టామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ ద్వారా ప్రసంగించిన ప్రధాని.. నేటికి ఒక వెయ్యేళ్ల క్రితం అంటే.. 1026 లో మొహమ్మద్ ఘజనీ సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడని.. కానీ వారికి ఇవాళ ఏ గుర్తింపూ లేదన్నారు. సోమనాథ్ ఆలయం ఈరోజు పూర్తి వైభవంతో విశాల సముద్రతీరంలో భారతదేశానికి అమరత్వపు ఆశీర్వాదాన్నిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. అందువల్ల ఈ ఏడాది ఎంతో గర్వంతో సోమనాథ్ స్వాభిమాన్ పండుగను జరుపుకున్నామని చెప్పారు.
మన్ కీ బాత్ లో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ గురించి మాట్లాడటానికి ఒక ముఖ్య కారణం ఉందని తెలిపారు. 1026 లో మొహమ్మద్ ఘజ్నీ వల్ల సోమనాథ్ మందిరం విధ్వసం జరిగినప్పుడు, అదే సంవత్సరం గుజరాత్ లోని మోఢేరాలో ప్రసిద్ధమైన సూర్య దేవాలయం పై కూడా దాడి జరిగిందన్నారు. అంటే మోఢేరా ఆలయం విధ్వంసం జరిగి కూడా ఈ ఏడాదికి వెయ్యేళ్ళూ అయ్యాయని గుర్తు చేశారు. నిజానికి ఆ విధ్వంస సమయానికి ఈ ఆలయ నిర్మాణం జరిగి ఒక్క ఏడాదే అయ్యిందని చెప్పారు.1025లో రాజా భీమ్దేవ్ ఈ ఆలయాన్ని నిర్మించారన్నారు. అదే సమయంలో రాజా భీమ్ దేవ్-1 ఘజనీతో తలపడటమే కాక కొద్ది సమయంలోనే మొఢేరా సూర్య దేవాలయాన్ని పున:నిర్మించాడని తెలిపారు. ఈ జీవశక్తి కారణంగానే సోమనాథ ఆలయం మాటిమాటికీ విధ్వంసం చెందినప్పటికీ, తిరిగి నిర్మితమౌతూనే ఉందన్నారు. తరువాతి కాలంలోనూ మొఢేరా సూర్య దేశాలయంపై దాడులు జరిగాయని గుర్తు చేశారు.
నేడు మొఢేరా కేవలం సూర్య ఆలయం కేంద్రంగానే కాక గుజరాత్ లోని ఈ గ్రామం మొదటి సూర్య గ్రామం సోలార్ విలేజ్గా మారింది. మొఢేరా గ్రామం నేడు పూర్తిగా సూర్య శక్తితో నడుస్తుంది. ఇది దేశ సస్టైనబిలిటీకి ఒక మంచి ఉదాహరణ అని అన్నారు. మొఢేరా లో పర్యాటకుల కోసం ఎన్నో ఆకర్షణలు, సదుపాయాలు కూడా ప్రారంభమయ్యాయని.. జనవరిలో మకర సంక్రాంతి తర్వాత మొఢేరాలో నృత్య మహోత్సవాలు కూడా జరుగుతాయని చెప్పారు. ఇందులో భారతీయ సాంస్కృతిక, శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన జరుగుతుందన్నారు. గత కాలంతో మన బంధం నేటికీ సజీవంగా ఉందని.. దీని వెనుక వారి సమర్పణా భావం, శ్రమ ఉందన్నారు. అదే ఆ బంధాన్ని మరింత గాఢంగా మారుస్తోందని చెప్పారు.