తెలంగాణ
హైదరాబాద్ గణేశ్ నిమజ్జన బందోబస్తులో టెక్నాలజీ వినియోగం
24-09-2026 09:59
పెద్ద శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్లకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేశ్ తో పాటు బాలాపూర్ గణేశ్ నిమజ్జనం కూడా ఈనెల 25వ తేదీనే జరుగుతుందని వెల్లడించారు.
xPress24, HYDERABAD, September 24,
సెప్టెంబర్ 25న జరగనున్న పెద్ద శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన ఈ పండుగ చివరి రోజుకు చేరుకుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, సిటీ పోలీసులు, GHMC, టీజీ ఎస్పీడీసీఎల్, హెల్త్ డిపార్ట్ మెంట్ సహా అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఖైరతాబాద్ బడా గణేశ్ ను సుమారు 25 లక్షల మంది, బాలాపూర్ గణేశ్ ను 15 లక్షల మంది దర్శించుకున్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. బాలాపూర్ గణేశ్ కూడా 25న నిమజ్జనం జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ అన్నారు.
నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా 24 డ్రోన్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 10 వేల సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుంధానం చేశామన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 100 హైరైజ్ కెమెరాలతో నిమజ్జనానికి వచ్చే విగ్రహాలపై నిఘా పెట్టామన్నారు. 25వ తేదీన విధుల్లో 20 వేల మంది నగర పోలీస్ సిబ్బందితో పాటు.. బయట నుంచి 8142 మంది పాల్గొంటారని అన్నారు. వీరితోపాటు 6 కేంద్ర భద్రతా బలగాలు కూడా పాల్గొంటారని తెలిపారు.దొంగతనాలను అరికట్టేందుకు నిమజ్జన ప్రాంతాలను 5 సెక్టార్లుగా విభజించి.. 25 ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళల రక్షణ కోసం 26 షీటీమ్స్ ను రంగంలో కి దించామన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.