తెలంగాణ
హైదరాబాద్ బాలాపూర్‌లో అగ్నిప్రమాదం
05-10-2026 10:23

ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు, కెమికల్ డ్రమ్ములు పేలుడు. హైదరాబాద్ బాలాపూర్ పరిధిలోని నబీల్ కాలనీలో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు కెమికల్ డ్రమ్ములు పేలి మంటలు ఎగసిపడగా, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
xPress24, Hyderabad, October 5,
హైదరాబాద్‌లోని బాలాపూర్ నబీల్ కాలనీలో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో నిల్వ ఉంచిన పాత కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో అవి ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చి, దట్టమైన పొగతో పాటు ఆకాశమంత ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు మరియు ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.